Monday, April 6, 2015

బాబా గా మారిన చంద్రమోహన్


సీనియర్ నటుడు చంద్రమోహన్ ఇన్నాళ్లుగా భక్తుడి వేషాలు వేశారు. ఇప్పుడు తాజాగా బాబాగా నటిస్తున్నారు. విభిన్నమైన పాత్రలో ఆయన నటిస్తున్న చిత్రం ‘మూర్ఖుడు’. సృజన ఆర్ట్స్ క్రియేషన్స్ పతాకంపై సత్యం ముప్పిడి దర్శకత్వంలో డా.సి.వి.రత్నకుమార్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పతాక సన్నివేశాలతో చిత్రీకరణ పూర్తిచేశారు. ఈ సందర్భంగా దర్శకుడు సత్యం ముప్పిడి మాట్లాడుతూ ‘చంద్రమోహన్, ధన్‌రాజ్‌లపై చిత్రీకరించిన క్లైమాక్స్ సన్నివేశాలు చిత్రానికి హైలెట్‌గా ఉంటాయి. దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ ఆటోబయోగ్రఫీ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో చంద్రమోహన్ బాబాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా రూపొందిస్తున్న ఈ చిత్రంలో కెమెరా పనితనం హైలెట్‌గా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో చంద్రమోహన్ పాత్ర ప్రతి ఒక్కరినీ కదిలిస్తుందని, బాబాగా ప్రేక్షకులను ఆకట్టుకుంటారని, చంద్రమోహన్, ధన్‌రాజ్‌ల మధ్య వచ్చే సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయని, ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు వేగంగా జరుపుతున్నామని నిర్మాత డా.సి.వి.రత్నకుమార్ తెలిపారు. త్వరలో ఆడియో విడుదలచేసి, వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, అనేకమంది కథలతో చిత్రాలను రూపొందించిన రామ్‌గోపాల్‌వర్మ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని ఆయన అన్నారు. తన యాభయ్యేళ్ల సినీ కెరీర్‌లో తొలిసారిగా బాబాగా నటిస్తున్న ఈ చిత్రం అందర్నీ ఆలోచింపచేస్తుందని నటుడు చంద్రమోహన్ పేర్కొన్నారు. ఈ చిత్రానికి నిర్మాత: డా.సి.వి.రత్నకుమార్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సత్యం ముప్పిడి.

No comments:

Post a Comment