Friday, April 10, 2015

రాజుకు ఏడేళ్ల శిక్ష

సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈఓ రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందికి ప్రత్యేక కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి గురువారం 971 పేజీల తీర్పు వెలువరించారు. రామలింగరాజుకు రూ. 5.74 కోట్లు, రామరాజుకు రూ. 5 కోట్ల 73 లక్షల 75 వేలు జరిమానా విధించారు. మిగతా నిందితులందరికీ కలిపి రూ. 13.84 కోట్లు జరిమానాగా విధించారు. వివిధ నేరాలకు వేర్వేరుగా శిక్షలు విధించినా వాటిని ఏకకాలంలో అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. దీని ప్రకారం దోషులంతా గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా చెల్లించకపోతే మరికొన్ని నెలలు అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే విచారణ ఖైదీలుగా జైలులో ఉన్న కాలాన్ని మినహాయించి (సీఆర్పీసీ సెక్షన్ 428 కింద) మిగతా శిక్షా కాలాన్ని మాత్రమే దోషులు అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు ప్రతులను దోషులకు అందజేశారు. దీనిపై పైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని, అవసరమైతే లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయసహాయం పొందవచ్చని వారికి సూచించారు. విచారణలో సహకరించిన సీబీఐ స్పెషల్ పీపీ, నిందితుల తరఫు న్యాయవాదులు, ఇతర కోర్టు సిబ్బందికి న్యాయమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.

No comments:

Post a Comment