పోరాటమే కాదు........రొమాన్స్ కూడా
మోస్ట్ ఎవైటెడ్ మూవీ రుద్రమదేవి సినిమాకు సంబంధించి దర్శకుడు, నిర్మాత గుణశేఖర్ మరో ఆసక్తికర విషయం వెల్లడించారు. రుద్రమదేవి పోరాట గాథ మాత్రమే కాదని...ఇదొక ప్రేమ కథా చిత్రం అని కూడా ఆయన వెల్లడించారు. తెలుగు జాతి గర్వించేలా, కాకతీయుల వైభవాన్ని కళ్లకు కట్టేలా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని గుణశేఖర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. రుద్రమదేవి సినిమా గురించి కన్ ఫ్యూజన్ అవసరం లేదని ఆయన అన్నారు. రుద్రమదేవి పూర్తిగా పోరాట చిత్రం కాదని... అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తగినంత రొమాన్స్ కూడా ఉంటుందని గుణశేఖర్ చెప్పారు. ఏ విషయంలోనూ రాజీపడకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 70 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు గుణశేఖర్ తెలిపారు. రీ రికార్డింగ్ పనుల్లో ఇళయరాజా లండన్ లో బిజీగా ఉన్నారని , రెండు వారాల్లో పూర్తి కావచ్చన్నారు. సినిమా విడుదల తేదీని నిర్ణయించలేదని..మేలో ప్రేక్షకుల ముందుకు రావచ్చని చెప్పారు. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో వస్తున్న రుద్రమదేవి చిత్రంలో ప్రధాన పాత్రలో అనుష్క, మరో ముఖ్య పాత్రలో రానా , గోన గన్నారెడ్డిగా అల్లు అర్జున్ అలరించనున్నారు. ప్రకాష్ రాజ్, కృష్టంరాజు,సుమన్, నిత్యమీనన్, కేథరీన్ తదితర భారీ తారాగణం నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. వేసవిలో రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.
No comments:
Post a Comment