Friday, May 15, 2015

కొత్త మార్గాల్ని ఎంచుకుంటోంది ప్రియాంక

కేవలం బాలీవుడ్ సినిమాలకే పరిమితమైపోకుండా అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకోవడానికి కొత్త మార్గాల్ని ఎంచుకుంటోంది ప్రియాంకచోప్రా. 
ఎగ్జోటిక్ అనే పాప్ ఆల్బమ్ ద్వారా గాయనిగా అమెరికా సంగీత ప్రపంచంలో మంచిగుర్తింపును సంపాదించుకున్న ఈ సుందరి తాజాగా ప్రఖ్యాత అమెరికా యాక్షన్ డ్రామా సిరీస్‌క్వాన్టికోలో కీలక పాత్రలో నటించింది. 

 అత్యంత జనాదరణ పొందిన ఈ సీరియల్‌లో ప్రియాంకచోప్రా నేర పరిశోధనాధికారిణిగా (ఎఫ్‌బీఐ ఏజెంట్) ఛాలెంజింగ్ పాత్రను పోషించింది. ఇటీవలే ఈ షో తాలూకు మూడు నిమిషాల నిడివిగల ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా అభినయానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. 

పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తున్నారు. అమెరికాపై దాడిచేసిన టెర్రరిస్టులను వెతికిపట్టుకోవడానికి నియమించిన ఎఫ్‌బీఐ బృందంలో కీలకమైన అధికారిణిగా ప్రియాంకచోప్రా పాత్ర ఆసక్తికంగా వుంటుందని అభినందిస్తున్నారు. 

ఈ సీరియల్ తాలూకు ట్రైలర్‌ను ఒక్కరోజులోనే పది లక్షల మంది వీక్షించడం విశేషం. తాను తొలిసారిగా అమెరికన్ టెలివిజన్ రంగంలో అడుగుపెడుతూ చేసిన క్వాన్టికో సిరీస్‌కు అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా వుందని, భారతీయ ప్రేక్షకుల ఆశీస్సులతో అమెరికా టెలివిజన్ రంగంలో మరిన్ని అవకాశాల్ని సొంతం చేసుకుంటానని ప్రియాంకచోప్రా ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సుందరి హిందీలో బాజీరావు మస్తాని అనే చారిత్రక చిత్రంలో నటిస్తోంది.

No comments:

Post a Comment