Friday, May 15, 2015

రామ్‌చరణ్ ‘బ్రూ‌స్ లీ’


‘గోవిందుడు అందరివాడేలే’ రిలీజై 9 నెలలు కావస్తున్నా.. రామ్‌చరణ్ తన నెక్స్ట్ మూవీ సెట్స్‌కు ఇంకా వెళ్ళలేదు. శ్రీను వైట్లతో చేసే సినిమా స్టోరీ కోసం పక్కా స్క్రీన్‌ప్లే, కాస్టింగ్ కోసం ఆలస్యమైంది. ఈ నెలాఖరు నుండి సెట్స్‌కు వెళ్తోందని టాక్. 
తొలుత ఈ మూవీకి ‘మై నేమ్ ఈజ్ రాజు’ అనే టైటిల్ ప్రచారం‌లో ఉండగా, ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ సీన్‌లోకి వచ్చింది. ఇందులో చెర్రీ స్టంట్ మాస్టర్ రోల్ చేస్తున్నాడని, దీనికి ‘బ్రూ‌స్ లీ’ అనే పేరు ఫిక్సయ్యే చాన్స్ ఉందని లేటెస్ట్‌ న్యూస్. ఈ రోల్ కోసం బ్యాంకాక్‌లో కొన్నాళ్ళు ఫిట్‌నెట్ ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇపుడు ఫ్లైట్స్, ఫిట్నెస్ బిజినెస్‌లతోపాటు చిరంజీవి 150 మూవీని కూడా నిర్మించే బిజీలోవున్నాడు. రాజు.. టైటిల్ కంటే బ్రూస్లీ టైటిల్ క్యాచీగా వుంటుందని చెర్రీని శ్రీను వైట్ల కన్విన్స్ చేసినట్టుగా తెలుస్తోంది.

కొత్త మార్గాల్ని ఎంచుకుంటోంది ప్రియాంక

కేవలం బాలీవుడ్ సినిమాలకే పరిమితమైపోకుండా అంతర్జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటుకోవడానికి కొత్త మార్గాల్ని ఎంచుకుంటోంది ప్రియాంకచోప్రా. 
ఎగ్జోటిక్ అనే పాప్ ఆల్బమ్ ద్వారా గాయనిగా అమెరికా సంగీత ప్రపంచంలో మంచిగుర్తింపును సంపాదించుకున్న ఈ సుందరి తాజాగా ప్రఖ్యాత అమెరికా యాక్షన్ డ్రామా సిరీస్‌క్వాన్టికోలో కీలక పాత్రలో నటించింది. 

 అత్యంత జనాదరణ పొందిన ఈ సీరియల్‌లో ప్రియాంకచోప్రా నేర పరిశోధనాధికారిణిగా (ఎఫ్‌బీఐ ఏజెంట్) ఛాలెంజింగ్ పాత్రను పోషించింది. ఇటీవలే ఈ షో తాలూకు మూడు నిమిషాల నిడివిగల ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రియాంక చోప్రా అభినయానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి. 

పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తున్నారు. అమెరికాపై దాడిచేసిన టెర్రరిస్టులను వెతికిపట్టుకోవడానికి నియమించిన ఎఫ్‌బీఐ బృందంలో కీలకమైన అధికారిణిగా ప్రియాంకచోప్రా పాత్ర ఆసక్తికంగా వుంటుందని అభినందిస్తున్నారు. 

ఈ సీరియల్ తాలూకు ట్రైలర్‌ను ఒక్కరోజులోనే పది లక్షల మంది వీక్షించడం విశేషం. తాను తొలిసారిగా అమెరికన్ టెలివిజన్ రంగంలో అడుగుపెడుతూ చేసిన క్వాన్టికో సిరీస్‌కు అద్భుతమైన స్పందన రావడం ఆనందంగా వుందని, భారతీయ ప్రేక్షకుల ఆశీస్సులతో అమెరికా టెలివిజన్ రంగంలో మరిన్ని అవకాశాల్ని సొంతం చేసుకుంటానని ప్రియాంకచోప్రా ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ సుందరి హిందీలో బాజీరావు మస్తాని అనే చారిత్రక చిత్రంలో నటిస్తోంది.

Monday, April 13, 2015

సిద్ధమవుతున్న దగ్గుబాటి ‘మనం’

సిద్ధమవుతున్న దగ్గుబాటి ‘మనం’


దగ్గుబాటి కుటుంబ సభ్యులంతా ‘మనం’ సినిమా లాంటి ఓ ఫ్యామిలీ చిత్రం చేయాలని భావిస్తున్న విషయం తెలిసిందే. వెంకటేష్, రానా, నాగచైతన్య కలిసి ఓ కుటుంబకథా చిత్రంగా ఓ మల్టీస్టారర్ సినిమా రాబోతుందని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను రానా నిజం చేసేసాడు. త్వరలోనే ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనున్నట్లుగా తెలిసింది. వెంకటేష్, రానా, నాగ చైతన్యల కలయికలో రూపొందే ఈ సినిమా ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుందని, ఇప్పటికే ఈ సినిమాకు సంబందించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని రానా తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. రానా ప్రస్తుతం ‘బెంగళూర్ డేస్’ రీమేక్ లో నటిస్తున్నాడు. అలాగే నాగచైతన్య నటిస్తున్న ‘దోచేయ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. అయితే ఈ ముగ్గురు కలిసి నటించబోయే చిత్రం కమర్షియల్ మాస్, ఫ్యామిలీ యాక్షన్, కామెడీ, లవ్ ఎంటర్ టైనర్ గా వుండాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసింది. ఇందులో ఈ ముగ్గురు హీరోలకు ముగ్గురు హీరోయిన్లు వుండబోతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టును సురేష్ బాబు తన సొంత ప్రొడక్షన్ బ్యానర్లో నిర్మించనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

Saturday, April 11, 2015

కరివేపాకు కదా అని తీసి పారేయకండి. ఉపయోగాలు ఎన్నో…

కరివేపాకు కదా అని తీసి పారేయకండి. ఉపయోగాలు ఎన్నో…

రక్తహీనత, మధుమేహం, జీర్ణసంబంధమైన సమస్యలను నివారించడంలో కరివేపాకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇందులో విటమిన్-ఎ, ఫోలిక్ యాసిడ్, కాల్షియం పుష్కలంగా ఉన్నందున వంటల్లో దీన్ని విరివిగా వాడుతుండాలి. కరివేపాకులోని విటమిన్-ఎ వల్ల దృష్టి సంబంధ లోపాలను (కాటరాక్ట్) అధిగమించవచ్చు. ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఉన్నందున రక్తహీనత తగ్గుముఖం పడుతుంది. జీర్ణశక్తిని కూడా ఇది పెంపొందిస్తుంది. మధుమేహాన్ని తగ్గించే గుణం ఉన్నందున బ్లడ్ సుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లతో పాటు బాక్టీరియాను నివారించే అంశాలున్నందున కరివేపాకును వాడితే చర్మసంబంధ ఇన్‌ఫెక్షన్లకు దూరం కావొచ్చు. జట్టు రాలడం, తెల్లబడడం వంటి సమస్యలను అధిగమించేందుకు కరివేపాకును విరివిగా వాడాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

Friday, April 10, 2015

బన్నీ ఇమేజ్ కాస్త డ్యామేజ్



స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్ మీడియాకు క్షమాపణలు చెప్పాడట. దీంతో భగ్గుమన్న మీడియా మిత్రులు కాస్త కూల్ అయ్యారు. ఇంతకీ ఈ హీరో సారీ చెప్పడానికి కారణాలేంటి..? అసలేం జరిగింది..? ఇదే సినీ లవర్స్‌ను వెంటాడుతున్న ప్రశ్నలు. ఏప్రిల్ 8న బన్నీ బర్త్‌డే, 9న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈనెల 7న ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయాలని బన్నీ నిర్ణయించుకున్నాడు. దీంతో ఆయన పీఆర్‌ఓ మీడియా ప్రతినిధులు సమాచారం ఇవ్వడంతో మధ్యాహ్నం ఒంటిగంటకు అందరూ హాజరయ్యారు. ఐతే, అల్లుఅర్జున్ ఎంతకీ రాకపోవడంతో ప్రెస్‌మీట్‌ను బాయ్‌కాట్‌ చేస్తున్నట్లు రెండుగంటల తర్వాత మీడియా మిత్రులు ప్రకటించి అక్కడ నుండి వెనుదిరిగారు. ఈ క్రమంలో బన్నీ పీఆర్ఓ కొందరు రిపోర్టర్లలపై దురుసుగా మాట్లాడడంతో ఈ వ్యవహారం మరింత జఠిలమైంది. పరిస్థితి గమనించిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, బన్నీకి ఓ సలహా ఇచ్చాడట. తెల్లవారితే ‘ సన్నాఫ్ సత్యమూర్తి’ రిలీజ్ కాబోతోంది. ఇలాంటి సమయంలో వెనక్కి తగ్గడం మంచిదని సలహా ఇవ్వడంతో 8న ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి క్షమాపణలు చెప్పినట్టు సమాచారం. దీంతో సన్నాఫ్ సత్యమూర్తి’ నిర్మాత కాస్త హ్యాపీగా ఫీలయ్యాడట. లేకపోతే ఈ ఎఫెక్ట్ తన సినిమాపై ఎక్కడ పడుతుందోనని ఒకానొకదశలో ఆందోళన చెందినట్టు సమాచారం. మరోవైపు అల్లుఅర్జున్ వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో ఒకటే కామెంట్స్ పడిపోతున్నాయి. ఫిల్మ్ ఇండస్ర్టీలో ఇలా ఎవరూ వ్యవహరించలేదంటూ సైటైర్లు పడిపోతున్నాయి. మొత్తానికి బన్నీ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అయ్యిందనే చెప్పవచ్చు.

s/o సత్యమూర్తి'...పాజిటివ్ టాక్ వినిపిస్తోంది

'
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన 's/o సత్యమూర్తి' సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు సినిమా విడుదల కావడంతో ఉత్కంఠకు తెరపడింది. సినిమాపై ముందు నుండి అంచనాలు భారీగా ఉన్నాయి. బెనిఫిట్ షోలు, మార్నింగ్ షోలో చూసిన ప్రేక్షకుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం......సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ మరోసారి తన సత్తా చూపించాడు. ముఖ్యంగా సినిమాలోని డైలాగులు అదుర్స్ అంటున్నారు. ఇక సినిమాకు హైలెట్ క్లైమాక్స్ అని అంటున్నారు. అయితే సరైన ప్లేసింగ్ లేని సాంగులు సినిమా ఫ్లోను తగ్గించాయని అంటున్నారు. కానీ పాటల చిత్రీకరణ మాత్రం అద్భుతంగా ఉందని అంటున్నారు. సినిమా కథ చాలా బావుందనే అభిప్రాయం ఫ్యామిలీ ప్రేక్షకుల నుండి వినిపిస్తోంది. అయితే బన్నీని ఇప్పటి వరకు ఎనర్జిటిక్ గా చూసిన ప్రేక్షకులకు ఇందులోని స్లో స్క్రీన్ ప్లే అతనికి సెట్ కాలేదనే భావన కలుగింది. అయితే పెర్ఫార్మెన్స్ పరంగా, డాన్సుల పరంగా బన్నీ అదరగొట్టాడు. దేవిశ్రీ తన సంగీతం ప్రేక్షకులను సంతృప్తి పరిచాడు.

రాజుకు ఏడేళ్ల శిక్ష

సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసులో ఆ కంపెనీ వ్యవస్థాపక సీఈఓ రామలింగరాజు, ఆయన సోదరుడు రామరాజు సహా 10 మందికి ప్రత్యేక కోర్టు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. మొదటి, రెండో నిందితులుగా ఉన్న రామలింగరాజు, రామరాజుకు భారీగా, ఇతర నిందితులకు లక్షల్లో జరిమానా విధిస్తూ ప్రత్యేక కోర్టు జడ్జి బీవీఎల్‌ఎన్ చక్రవర్తి గురువారం 971 పేజీల తీర్పు వెలువరించారు. రామలింగరాజుకు రూ. 5.74 కోట్లు, రామరాజుకు రూ. 5 కోట్ల 73 లక్షల 75 వేలు జరిమానా విధించారు. మిగతా నిందితులందరికీ కలిపి రూ. 13.84 కోట్లు జరిమానాగా విధించారు. వివిధ నేరాలకు వేర్వేరుగా శిక్షలు విధించినా వాటిని ఏకకాలంలో అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. దీని ప్రకారం దోషులంతా గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా చెల్లించకపోతే మరికొన్ని నెలలు అదనంగా సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే విచారణ ఖైదీలుగా జైలులో ఉన్న కాలాన్ని మినహాయించి (సీఆర్పీసీ సెక్షన్ 428 కింద) మిగతా శిక్షా కాలాన్ని మాత్రమే దోషులు అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు ప్రతులను దోషులకు అందజేశారు. దీనిపై పైకోర్టులో అప్పీలు చేసుకోవచ్చని, అవసరమైతే లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఉచితంగా న్యాయసహాయం పొందవచ్చని వారికి సూచించారు. విచారణలో సహకరించిన సీబీఐ స్పెషల్ పీపీ, నిందితుల తరఫు న్యాయవాదులు, ఇతర కోర్టు సిబ్బందికి న్యాయమూర్తి కృతజ్ఞతలు తెలిపారు.